పక్షం రోజుల్లో వివరాలు సమర్పించాలి కలెక్టర్
నిజామాబాద్ ప్రతినిధి అక్టోబర్ 28 ద్రోణ
అమృత్ 2.0లో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని బోధన్, ఆర్మూర్ మున్సిపల్ పట్టణాలలో ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపకల్పన విషయమై కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధ్యక్షతన మంగళవారం నిజామాబాద్ నగర పాలక సంస్థ కార్యాలయం లో మొదటి కన్సల్టేటివ్ వర్క్‌షాప్ నిర్వహించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సౌకర్యాలను మెరుగుపరుస్తూ, ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు మాస్టర్ ప్లాన్ దోహదపడుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. దీనిని దృష్టిలో పెట్టుకొని సంబంధిత శాఖల అధికారులు నిర్ణీత నమూనాలో ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు అవసరమైన వివరాలను పక్షం రోజుల లోపు సమర్పించాలని సూచించారు. ఇప్పటికే పై రెండు మున్సిపాలిటీలలో డ్రోన్ సర్వే పూర్తి చేశారని, ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల పరిశీలన ప్రక్రియ కూడా జరిపారని వెల్లడించారు. సంబంధిత శాఖలు అందించే వివరాలను క్రోడీకరిస్తూ, ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తారని, రానున్న 20 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రణాళిక రూపొందుతుందని తెలిపారు. ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరిగాక, దానిపై అన్ని వర్గాల వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని, ఏవైనా అభ్యంతరాలు వస్తే, వాటిని పరిష్కరించి తుది మాస్టర్ ప్లాన్ రూపొందించి ఆమోదం నిమిత్తం ప్రభుత్వానికి పంపడం జరుగుతుందన్నారు. ఇప్పటికే నిజామాబాద్ నగర ముసాయిదా మాస్టర్ ప్లాన్ ను రూపొందించి ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపామని కలెక్టర్ గుర్తు చేశారు.కాగా, పట్టణాల భవిష్యత్ అభివృద్ధి, తాగునీటి సరఫరా మెరుగుదల, పార్కుల అభివృద్ధి వంటి వాటికి మాస్టర్ ప్లాన్ ఏవిధంగా ఉపకరిస్తుంది అనే అంశాలను అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ జాయింట్ డైరెక్టర్ రష్మీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ వర్క్ షాప్ లో అదనపు కలెక్టర్ అంకిత్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీఆర్డీఓ సాయాగౌడ్, బోధన్, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్లు జాదవ్, రాజు, మున్సిపల్, రెవెన్యూ, ప్రజారోగ్యం, జిల్లా పరిశ్రమలు, జాతీయ రహదారులు, రోడ్లు- భవనాలు, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మెప్మా, రైల్వే, ఆర్టీసీ, రవాణా, పోలీస్, టూరిజం, ట్రాన్స్ కో, విద్యా, వైద్యం, వ్యవసాయం, గనులు, కాలుష్య నియంత్రణ మండలి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

