అక్టోబర్ 31… వానమామలై వరదాచార్యులు వర్ధంతి………………………………. రామ కిష్టయ్య సంగన భట్ల… 9440595494………………………….తెలుగుదేశం ఆధునికపు కవితా పోకడలకు అలవాటు పడిన కాలమది. భావకవిత్వం, అభ్యుదయ కవిత్వం, వచనకవిత్వం లాంటి ఎన్నో నూతన సాహిత్య ప్రయోగాలాతో వర్ధిల్లుతున్న కాలంలో, ప్రాచీన కవితారీతులతో ప్రజలను మెప్పించిన కవి వానమామలై. అమూల్య సాహిత్య సంపదను తెలుగువారి కందించిన అద్వితీయ కవితా విశారదుడు, వాగీశ్వరీ మంత్ర సిద్ధిని పొందిన మహనీయుడు పుంభావ సరస్వతి వానమామలై వరదాచార్య. ఒక మహాకవి పోతన చరిత్రను మరోకవి గ్రంధస్థం చేయడం విశేషమే మరి. వానమామలై (1914-1984), 1914 ఆగస్టు 16న వరంగల్ జిల్లా మడికొండ గ్రామంలో వైఖానస బ్రాహ్మణుల పండిత కుటుంబంలో జన్మించారు. రైతు కుటుంబములో జన్మించిన వరదాచార్యులు ఏడవ తరగతి వరకు మాత్రమే చదివి ఎల్… సంస్కృతాంధ్ర సాహిత్యం, తార్కికం, వేదాంతం, వ్యాకరణాలను అభ్యసించారు. సంస్కృతం, తెలుగు, ఉర్దూ, హిందీ, ద్రవిడం, మరాఠీ, ఇంగ్లీషు భాషలలో పట్టు సాధించారు. హరికథాగానంలో ప్రావీణ్యతను సంతరించు కున్నారు. ఈయన అన్నలైన వానమామలై వేంకటాచార్యులు, వానమామలై లక్ష్మణాచార్యులు, వానమామలై జగన్నాథా చార్యులు కూడా సాహిత్యకారులే. కాళోజీ, పల్లా దుర్గయ్య, ఆచార్య బిరుదురాజు రామరాజువంటి సాహితీ దిగ్గజాలు మడికొండకే చెందిన వారేకాక, ఆయన ఆత్మీయులు కూడా.ఆయన సహజ పాండిత్యాన్ని గుర్తించిన అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా నిజామాబాద్ జిల్లా దోమకొండ జనతా కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమ నిర్వాహకుడిగా నియమించారు. తర్వాత ఆంధ్ర సారస్వత పరిషత్తునుండి విశారద పట్టా పుచ్చుకున్నారు. విశారద పూర్తయ్యాక చెన్నూర్ ఉన్నత పాఠశాలకు బదిలీ అయ్యి 13 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేసి 1972లో పదవీ విరమణ చేశారు. చెన్నూరులో వేదపాఠశాల నెలకొల్పారు. 1972లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పి.వి.నరసింహారావు శాసనమండలికి నామినేట్ చేయగా 1978 వరకు శాసనమండలి సభ్యుడిగా కొనసాగారు.1968లో పోతన చరిత్రము గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు, 1971లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ విశిష్ట సభ్యత్వము, 1973లో కరీంనగర్ జిల్లా కోరుట్లలో భారతీ సాహిత్య సమితి వారిచే గండపెండేరం, స్వర్ణ కంకణం, రాత్నాభిషేకం,1976లో సంపూర్ణానంద సంస్కృత విశ్వ విద్యాలయం, వారణాసి వారిచే డి.లిట్ వాచస్పతి గౌరవ పట్టా పొందారు. అభినవ కాళిదాసు, మహాకవి శిరోమణి, ఆంధ్ర కవిత ఉత్ప్రేక్ష చక్రవర్తి, అభినవ పోతన, ఆంధ్ర కవివతంస, మధురకవి, కవి కోకిల, కవిశిరో వతంస తదితర బిరుదాంచితులైనారు. తెలంగాణ ప్రజలను జాగృతం చేసేందుకు హైదరాబాద్ రాజ్యంలో (తెలంగాణ) నిజాం నియంతృత్వ పాలనను వర్ణిస్తూ అనేక పాటలు, పద్యాలు రాశారు. పౌరాణికుడిగా ప్రదర్శనలు ఇచ్చారు. హరికథలు, పురాణాలు చెప్పారు.”పోతన చరిత్రము” వ్రాసి ”అభినవ పోతన”గా వాసికెక్కిన వానమామలై తెలంగాణా కవులలో అగ్రగణ్యుడు, అపూర్వ సాహితీ దురంధరుడు…. దాశరథి కృష్ణమాచార్యులకు అతి సన్నిహితులు, ఆచార్య సి. నారాయణరెడ్డికి అత్యంత ఆప్తుడు, ఎన్నో గేయకృతులు, వ్యాసాలు, నాటకాలు, బుఱ్ఱకథలు ఎన్ని వ్రాసినా.. తెలుగు సాహిత్యంలో ఆయనకు సుస్ధిర స్థానాన్ని సముపార్జించి పెట్టింది ”పోతన చరిత్రము”. మహాభాగవత కర్త మహాకవి బమ్మెర పోతన్న జీవిత విశేషాలను అద్వితీయ ప్రబంధంగా అందించిన ఘనత మన వరదన్నదే.అలా తెలుగు రచయితల సంఘం ఆయనకు ”అభినవ పోతన” బిరుదునిచ్చి సత్కరించింది. ఆయన వరదన్న పుట్టి పెరిగింది మడికొండలోనే అయినా స్థిరపడింది తాత ముత్తాతల ఊరైన చెన్నూరు లోనే.‘వరదన్నకు చిన్ననాటనే బాల్యగురువైన కాళోజీ రంగారావు శ్రీరామ తారక మంత్రోపదేశం గావించారు. మంథెనవాసి మేనమామ తిరువరంగం గోపాలాచార్యులు వాగీశ్వరి మంత్రోపదేశం చేయగా, ఖాజీపేట సమీపంలోగల మెట్టుగుట్టపై ఎనభైరోజులు కఠోరదీక్షతో ఉపాసించి వాణీ కటాక్ష వరసిద్ధిని పొందినట్లు చెపుతారు.ఇతని శతజయంతి ఉత్సవాలు 18-8-2011 నుండి 18-8-2012 వరకు జరిగాయి. ఈ సందర్భంగా అనేక సభలు సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నూర్ లోని జగన్నాథ ఆలయానికి ఎదురుగా ఉన్న స్థలంలో ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు. క్షయవ్యాధి పీడితుడై, ఊపిరి తిత్తులకు పది సార్లు శస్త్రచికిత్సతో ఒక ఊపిరితిత్తి తోనే కడదాకా జీవించి,1984, అక్టోబరు 31నఈ లోకాన్ని వీడి వెళ్ళారు.

