నారాయణఖేడ్,30 సెప్టెంబర్ ప్రభ: మాయమాటలు చెప్పి భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై చర్యలు తీసుకొని మా భూములు మాకు ఇప్పించి న్యాయం చేయాలంటూ హంగిర్గ(బి) గ్రామానికి చెందిన రైతులు గురువారం నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ..2006 సంవత్సరంలో హైదరాబాద్ కు చెందిన కొందరు వ్యక్తులు గ్రామానికి వచ్చి ఇక్కడ కంపెనీ ఏర్పాటు చేసి మీ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మాయమాటలు చెప్పి 50 మంది రైతుల నుండి సుమారు 160 ఎకరాల వ్యవసాయ భూమిని ఎకరాకు అరకొర చెల్లించి కొనుక్కున్నారు అన్నారు.మా తల్లిదండ్రులు అమాయకులు కావడంతో తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తే వారి జీవితాలు బాగుపడతాయని నమ్మి అట్టి భూములను వారికి విక్రయించారు అన్నారు.భూములు కొనుక్కున్న నాటినుండి 20 ఏళ్లుగా కొనుక్కున్న వాళ్ళు ఇటువైపు రాలేరని,నాటినుండి నేటివరకు ఆ భూములలో సేద్యం చేస్తూ పంటలను పండించుకుంటున్నాము అన్నారు.ఇప్పుడు 2వ పార్టీ వ్యక్తి ద్వారా భూములను సర్వే చేయిస్తున్నాము భూముల నుండి వెళ్లిపోవాలని నోటీసులు వచ్చాయి అన్నారు.గతంలో భూములు అమ్మిన కొందరు వ్యక్తులు వయస్సు ప్రభావంతో,ఇతర కారణాలతో మరణించారని, కొందరు మాత్రమే బ్రతికి ఉన్నారు అన్నారు.మాయమాటలు చెప్పి మా పెద్దల దగ్గర నుండి భూములు కొనుక్కున్న వారు వచ్చి మాకు న్యాయం చేసేవరకు సర్వే నిలిపివేయాలి అన్నారు.అనంతరం కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రైతులు బిక్కునాయక్,హర్యా నాయక్,నామా నాయక్,సంగమ్మ, నర్సప్ప,మారుతి, కాశీనాథ్,సంతోష్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


