అక్రమ వెంచర్లు.. అడ్డగోలు అమ్మకాలు
క్యాష్ బ్యాక్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న వైనం
కడీలకు బదులు మొక్కలు నాటి లే అవుట్ చేసిన ఫాం ల్యాండ్
హద్దు రాళ్లకు బదులు మొక్కలు నాటుతూ లే అవుట్లు
ఫాం ల్యాండ్ పేరుతో రియల్టర్ల దందా
పుట్టగొడుగుల్లా అనుమతిలేని వెంచర్లు,
ఫామ్ ల్యాండ్లుఅధికారులు, ప్రజాప్రతినిధులు చేతివాటం?స్థానికులు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం..!







మర్పల్లి మండల కేంద్రం, మండల పరిధిలోని ని తుమ్మలపల్లి, పొట్లూర్ గ్రామాల్లో ఎస్ ఎస్ ఎల్ ఇన్ఫ్రా పేరుతో అనుమతుల్లేని వెంచర్లు, ఫాం ల్యాండ్లతో రియల్టర్లు ప్రజలను, ప్రభుత్వాన్ని మోసగిస్తున్నారు. గుంటల లెక్కన భూమి విక్రయిస్తూ సర్కారుకు పన్ను ఎగ్గొడుతున్నారు. అలాగే క్యాష్ బ్యాక్ పేరుతో తక్కువ రేటు ఆశచూపి అనుమతుల్లేని ప్లాట్లు అంటగడుతూ కొనుగోలుదారులను బురిడీ కొట్టిస్తున్నారు.
మర్పల్లి, అక్టోబర్ 30, ప్రభ: రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పుడు పల్లెలకూ విస్తరిస్తోంది. మండల కేంద్రాల చుట్టూ ఖాళీ జాగ కనిపిస్తే చాలు రియల్ వ్యాపారులు అక్కడ పాగా వేసి ప్లాట్లుగా మార్చి అమ్మేస్తున్నారు. మర్పల్లి మండలంలోని తుమ్మలపల్లి, పొట్లూర్గ్రామాల్లో ఎస్ఎస్ఎల్ ఇన్ఫ్రా సమస్త పేరుతో అక్రమ ఫాం ల్యాండ్, వెంచర్ల దందా జోరుగా కొనసాగుతోంది. మండల కేంద్రంలో రియల్టర్లు కొత్త పద్ధతిలో వెంచర్లు, ఫామ్ ల్యాండ్లను ఏర్పాటు చేస్తున్నారు. వెంచర్లలో హద్దు రాళ్లకు బదులు మొక్కలు నాటి సాగు భూమిగా చూపుతూ ప్లాట్లు విక్రయిస్తున్నారు. నిబంధనల మేరకు ల్యాండ్ కన్వర్షన్ కోసం ప్రభుత్వానికి కట్టాల్సిన ఫీజును ఎగ్గొట్టేందుకు నయా దందాకు పాల్పడుతున్నారు. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. పంచాయతీ పరిధి వెంచర్‌లో 10శాతం భూమిని పంచాయతీ పేరిట రిజిస్ర్టేషన్ చేసి, 33ఫీట్ల రోడ్లను ఏర్పాటు చేయాలి. కానీ రియల్టర్లు.. అధికారులు, పాలకులకు ముడుపులు ముట్టజెబుతూ నిబంధనలు పాటించడం లేదు. మూడుచింతలపల్లిలో ఎన్ని అక్రమ వెంచర్లు, ఫామ్‌ల్యాండ్లు ఉన్నాయో అధికారులకే తెలియని పరిస్థితి నెలకొంది.*గుంటల లెక్కన రిజిస్ట్రేషన్లు*నిబంధనల నుంచి తప్పించుకునేందుకు ప్లాట్లను గజాల్లో కాకుండా గుంటల్లో రిజిస్ర్టేషన్ చేయిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వానికి ఫీజు ఎగ్గొడుతూ కొనుగోలు దారులను సైతం మోసం చేస్తేన్నారు. భవిష్యత్తులో వారు ఇల్లు కట్టుకోవాలన్నా, ఇతర నిర్మాణాలు చేసుకోవాలన్నా ఎల్‌ఆర్‌ఎస్ వారే భరించాల్సి ఉంటుంది. తక్కువ రేటుక వస్తుందని ఇప్పుడు ప్లాట్లు తీసుకుంటున్న వారు తరువాత ఆర్థిక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వెంచర్లు, ఫామ్ ల్యాండ్లలో ఎక్కడా హద్దు రాళ్లు లేకుండా ప్లాట్ల మధ్య హద్దులుగా మొక్కలు నాటుతున్నారు. రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ర్టిక్ లైనింగ్‌లు లేకుండా గుంటల లెక్కన అమ్మేస్తున్నారు. ఒక గుంటకు 121గజాల చొప్పున లెక్కగడుతున్నారు. గుంటకు ఇంత అనీ రేటు కట్టి వ్యవసాయ భూమి కింద రిజిస్ర్టేషన్ చేయిస్తున్నారు. నిజానికి కమర్షియల్ లేదా నివాస భూములను సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో రిజిస్ర్టేషన్ చేయాలి. కానీ ఇక్కడ సాగుభూమి కింద అమ్ముతున్నట్టు చూపి మర్పల్లి మండల్ తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ర్టేషన్ కానిచ్చేస్తున్నారు. మధ్య తరగతి ప్రజలే టార్గెట్‌గా పాంప్లెట్లతో పబ్లిసిటీ చేసుకుంటూ డీటీపీసీ అనుమతులున్నాయంటూ నమ్మిస్తూ ప్లాట్లను అంటగడుతున్నారు. అలాగే క్యాష్ బ్యాక్ పేరుతో మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకొని మొక్కలు నాటి మొక్కలకి మెయింటినెన్స్ మొత్తం మేమే చూసుకుంటామంటూ చేస్తున్నారు. ఎస్ఎస్ఎల్ ఇన్ఫ్రా సంస్థ ఫామ్ ల్యాండ్లలో పెట్టుబడి పెట్టిన కొనుగోలుదారులు చాలావరకు మోసపోయారకమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తదనంతర కాలంలో ప్లాట్ల కొనుగోలుదారులు ఇంటి నిర్మాణానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అనుమతుల్లేకుండా విక్రయిస్తూ మోసగిస్తున్నారు. *భవిష్యత్తులో కొనుగోలుదారులకు తప్పని తిప్పలు..*పేదలు తమ రక్తాన్ని చెమటగా మార్చి రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బుతో భవిష్యత్తులో తమ పిల్లల అవసరాల కోసం లక్షల రూపాయలు వెచ్చించి ఫ్లాట్ లను కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదునుగా భావించిన వెంచర్ నిర్వాహకులు అమాయక పేద ప్రజలకు ఎలాంటి అనుమతులు లేని ప్లాట్లును అమ్ముతూ మోసం చేస్తున్నారు. భవిష్యత్తులో తాము కొనుగోలు చేసిన స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టాలంటే వారు ముప్పుతిప్పలు పడాల్సిందే, ఇదంతా సంబంధిత అధికారులకు తెలిసినప్పటికీ నిర్లక్ష్యం తో ఉంటూ పేద ప్రజలను మోసం చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మర్పల్లి మండల కేంద్రం, మండల పరిధిలోని తుమ్మలపల్లి, పొట్లూర్ గ్రామం సర్వే నంబర్,223/ఎ/2/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/2 లో ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే వెంచర్లు, ఫామ్‌ల్యాండ్లు ఏర్పాటు చేస్తున్నారు. అమాయక ప్రజలు తెలియక ప్లాట్లను కొంటూ మోసపోతున్నారు. ప్రభుత్వానికి, పంచాయితీకి రావాల్సిన ఆదాయానికీ గండికొడుతున్నారు. ఇలా పలు రకాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అక్రమ వెంచర్లు, ఫామ్ ల్యాండ్లుపై చర్యలు తీసుకోవాలి. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు మామూళ్ల మత్తులో పడి పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మర్పల్లి అధికారుల పర్యవేక్షణ లేక రియల్టర్లు అక్రమ వెంచర్లు, ఫామ్ ల్యాండ్లు ఏర్పాటు చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఒక్కదానికైనా డీటీసీపీ అప్రూవల్, పంచాయతీ లే అవుట్ ఉన్న ప్లాట్లు లేవు. గుంటల్లో అమ్మితే అవేమీ లెక్కలోకి రావంటూ కొనుగోలుదారులను మోసగిస్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్రమ వెంచర్లు, ఫామ్ ల్యాండ్ల రిజిస్ర్టేషన్లను నిలిపివేసి సదరు భూములకు నిషేధిత జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకోవాలి.ఎస్ఎస్ఎల్ ఇన్ఫ్రా వెంచర్లు, ఫామ్ ల్యాండ్లపై విచారణ జరిపి అనుమతుల్లేని వాటిలో అమ్మకాలను నిలిపివేసి, సదరు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని గ్రామాల రైతులు, ప్రజలు కోరుతున్నారు.

