‘ఐబొమ్మ’ వెబ్‌సైట్ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. 2019 నుంచి భారీ నెట్‌వర్క్‌ను నడుపుతూ వేలాది సినిమాలను పైరసీ చేసి.. ఇండస్ట్రీకి సుమారు రూ.3,000 కోట్ల నష్టం కలిగించిన ప్రధాన నిందితుడిగా రవిని గుర్తించారు. కాగా హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు రవిని నాంపల్లి కోర్టులో హాజరు పరచగా.. విచారించిన జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు రవిని చంచల్ గూడ జైలు కు తరలించారు.
ఎలా అరెస్ట్ అయ్యారంటే:కాగా ఐ బొమ్మ రవికి గత కొంతకాలంగా తన భార్యతో విభేదాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విభేదాలు కారణంగా విదేశాలలో ఉన్న ఈయన తన భార్య నుంచి విడాకులు తీసుకోవడం కోసం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ వస్తున్నట్టు సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోలీసులకు స్వయంగా సమాచారాన్ని రవి భార్య అందవేసినట్టు తెలుస్తుంది. దీంతో సమాచారం ప్రకారం పోలీసులు రవి కదలికలపై నిఘా పెట్టి పక్కా పథకం ప్రకారం అరెస్టు చేశారని స్పష్టమవుతుంది.
సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈఓ: మరోవైపు రవి ముంబై యూనివర్సిటీలో రవి ఎంబీఏ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. అయితే అతను నెదర్లాండ్స్, కరేబియన్ దీవులకు వెళ్ళే ముందు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీని నెలకొల్పాడు. వెబ్ డిజైన్ సర్వీస్ అందించే సాఫ్ట్‌వేర్ కంపెనీ స్థాపించాడు. ER infotech అనే సాఫ్ట్‌వేర్ కంపెనీకు CEOగా ఉన్నాడు. ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే రవి వైజాగ్‌కు చెందిన వ్యక్తి. అయితే హైదరాబాద్‌లో కూకట్‌పల్లిలో ఒక అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. ఇక తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు ఐబొమ్మతో పాటు 65 పైరసీ వెబ్‌సైట్‌లపై కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో ఐదుగురు కీలక నిందితులను అరెస్టు చేశారు. తాజాగా రవిని అదుపులోకి తీసుకోవడం కేసులో కీలక మలుపుగా భావిస్తున్నారు. పోలీసులు విచారణలో భాగంగా రవి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్టు చెబుతున్నారు.

