కూకట్ పల్లి :



“నశా ముక్త్ భారత్”కు బాలానగర్‌లో ఘన ప్రమాణం: డ్రగ్స్ లేని సమాజ స్థాపనకు ప్రతిజ్ఞ”నశా ముక్త్ భారత్ అభియాన్” 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ నర్సింహా రాజు ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా యువతలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన కల్పించడం, వారి సృజనాత్మకతను ప్రోత్సహించడం, భవిష్యత్తును రక్షించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతోంది.ఈ కార్యక్రమంలో భాగంగా, బాలానగర్ నర్సాపూర్ క్రాస్ రోడ్స్ వద్ద బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్, ఐపీఎస్, గారి పర్యవేక్షణలో “నశా ముక్త్ భారత్ అభియాన్” ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా డీసీపీ సురేష్ కుమార్ మాట్లాడుతూ… నశా ముక్త్ భారత్ అభియాన్ ప్రమాణాన్ని చదివించి, మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. యువత, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, సమాజంలో అవగాహన పెంపొందించడం ద్వారా భవిష్యత్ తరాలను రక్షించాల్సిన అవసరం ఉందని ఆయన ప్రత్యేకంగా వెల్లడించారు. అవగాహన, కఠిన చర్యలు, ప్రజల సక్రియ భాగస్వామ్యం ద్వారానే ‘నశా ముక్త భారత్’ నిర్మాణం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.అనంతరం బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి ప్రసంగిస్తూ… 2026 నాటికి తెలంగాణలో మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించేందుకు పోలీసులు కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రచారాలు, శిక్షణ, పునరావాస చర్యలు, సమాజ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు.ఈ కీలక కార్యక్రమంలో బ్రైట్ కాన్సెప్ట్ హై స్కూల్, శ్రీ సాయి విద్యానికేతన్, బ్రైట్ స్కాలర్స్, సీఐటీడీ, నైపర్ విద్యార్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారందరూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేందుకు, సమాజాన్ని ‘డ్రగ్-ఫ్రీ తెలంగాణ’ వైపు నడిపించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ అవలోకనం డ్రగ్స్ రహిత సమాజం కోసం సాగే పోరాటంలో ప్రజల భాగస్వామ్యాన్ని బలోపేతం చేసింది. ఈ కార్యక్రమంలో బాలానగర్ ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్, జగద్గిరిగుట్ట సీఐ వెంకటేశం, బాలానగర్ ఎస్ఐలు సరితా రెడ్డి, హాజీ మియా, వినోద్ కుమార్, ఏఎస్ఐ హనుమయ్య ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

