హెచ్‌ఏఎల్ ఓబీసీ సంక్షేమ సంఘం 30 ఏళ్ల సమిష్టి కృషిఅధ్యక్షుడు రవి ముదిరాజ్ కు ప్రశంసలు వెల్లువ
కూకట్ పల్లి నవంబర్ 22,ప్రభ: హెచ్‌ఏఎల్ (ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం 30వ ఆవిర్భావదినోత్సవ వేడుకలు హెచ్‌ఏఎల్ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. దేశంలో ఓబీసీల హక్కులు, రిజర్వేషన్ల అంశంపై డిమాండ్లకు వేదికగా ఈ కార్యక్రమం నిలిచింది.సంఘం అధ్యక్షుడు రవి కుమార్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య హాజరై, హెచ్‌ఏఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి. రామ్మోహన్ రావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.– కీలక డిమాండ్లపై దృష్టి…..సభనుద్దేశించి ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సేవలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ) ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ అమలులోకి వచ్చిన తర్వాత ఓబీసీ సంక్షేమ సంఘాల పాత్ర మరింత కీలకంగా మారిందని అన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం హెచ్‌ఏఎల్ ఓబీసీ సంఘం చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. అయితే సంఘం నాయకులు కేవలం హెచ్‌ఏఎల్ ఉద్యోగుల ప్రయోజనాలకే కాకుండా దేశంలోని మొత్తం ఓబీసీ వర్గం సంక్షేమం కోసం పోరాడాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మూడు కీలక డిమాండ్లను ప్రస్తావించారు. ఓబీసీలకు అన్యాయం చేస్తోన్న ‘క్రీమీలేయర్’ నిబంధనను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన తరగతులకు (బీసీ) రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని, ఈ కార్య సాధనకై అందరూ కలిసికట్టుగా పోరాడాలని కోరారు. ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్ల కోటాను పెంచడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తొలి పీఎస్‌యూగా హైదరాబాద్లోని హెచ్‌ఏఎల్ ఏవియానిక్స్ విభాగం నిలిచిందని ఎంపీ కృష్ణయ్య అభినందించారు. ఈ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ఓబీసీ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు దాన కర్ణచారి, ఏఐఓబీసీ ఉపాధ్యక్షుడు యు. చిన్నయ్య ముదిరాజ్, యూనియన్ అధ్యక్షుడు వెంకటాద్రి, సలహాదారులు రామచంద్రయ్య, జయేందర్ గౌడ్ సహా పలువురు ముఖ్యులు పాల్గొన్నారు. అలాగే, హెచ్‌ఏఎల్ ఎస్సీ, ఎస్టీ సంఘాల అధ్యక్షులు రమేష్ బాబు, చుడమణ్, ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్ర కుమార్, ప్రధాన కార్యదర్శి మధుసూదన్ హాజరై సంఘీభావాన్ని తెలిపారు. ఓబీసీ సంఘం కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్, అశోక్, భాగ్యలక్ష్మి, కెవి రవికుమార్, క్రాంతి, నాగరాజు, శాంతి, జోగారావు, భూపాల్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


